హైదరాబాద్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఈ నెల 23వ తేదీన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్నారు. సోమవారం రాత్రికి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్కు వచ్చి, గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు. ఇక గౌతమ్ రెడ్డి మృతితో సొంతూరు బ్రాహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులు, సన్నిహితులు బోరున విలపిస్తున్నారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడంతో.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు