అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ ( Meteorological Department) పలు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న పోర్టులకు హెచ్చరికలు చేసింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగి వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందని స్పష్టం చేసింది.
ఈ కారణంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, యానాం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మన్యం, అల్లూరి, ఏలూరు, గుంటూరు. శ్రీకాకుళం, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు పడుతాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.