Nagababu | టీటీడీ చైర్మన్గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారని సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం కూడా నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఏ పదవిని ఆశించడం లేదని చెప్పారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని తెలిపారు.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి తమ్ముడి వెంటే నాగబాబు ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేశారు. నాగబాబు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ.. తమ్ముడికి అండగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తు ధర్మంతో పవన్ కల్యాణ్ ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ జనసేన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది కాబట్టి.. తన సోదరుడికి ఎలాగైనా మంచి పదవి అప్పగించాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని.. అందుకే టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకు ఇవ్వాలని చంద్రబాబును అడిగారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించి అదంతా వట్టి ప్రచారమేనని స్పష్టంచేశారు.