తిరుమల : పొగాకు రహిత ప్రాంతంగా తిరుమలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే తిరుమలలో మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తులు కలిగి ఉండడం చట్టం ప్రకారం నేరంగా దేవాదాయ శాఖ గుర్తిస్తుంది. అలిపిరిలో టోల్గేట్ వద్ద కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించి నిషేధిత పదార్థాలు తిరుమలకు చేరకుండా టీటీడీ భద్రతా విభాగం చర్యలు చేపడుతోంది. ఈ విషయంపై భక్తుల్లో మరింత అవగాహన పెంచాలని టీటీడీ నిర్ణయించింది.
దేశంలో ఇప్పటివరకు జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని మాత్రమే పొగాకు రహిత ప్రాంతంగా డబ్ల్యుహెచ్వో గుర్తించింది. ఆ తరువాత ఈ గుర్తింపు తిరుమల క్షేత్రానికి దక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాన్ కమ్యూనికబుల్(ఎన్సీడీ) విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీడీలు, సిగరెట్లు, ఇ-సిగరెట్లు, పాన్పరాగ్, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులను భక్తులు తిరుమలకు తీసుకురాకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది.
ఈ విషయాలపై భక్తులకు తగిన సూచనలు ఇచ్చేందుకు విజిలెన్స్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రెండు రోజుల పాటు 500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, అక్టోపస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.