Keshava Rao | ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటకు చెందిన కేశవరావు బుధవారం మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దాంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఫొటో సైతం ఒకటి బయటకు వచ్చింది. నంబాల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సైతం స్పందించారు.
నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. ఆయన తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో సేవలందించారు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. ఆయన మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గానూ పని చేశారు. వరంగల్ ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజినీరింగ్ చదువుతుండగా.. పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువును మధ్యలోనే ఆపేసి.. ఉద్యమం బాటపట్టారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గాడిపారు. నక్సల్బరి ఉద్యమంలో చేరాక మళ్లీ ఎప్పుడూ గ్రామం వైపు చూడలేదు. ఆయన గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలో నిపుణుడు. ఆయన 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల వద్ద శిక్షణ సైతం తీసుకున్నారు. 2018 నవంబర్‌లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు స్వీకరించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి కేశవరావు.
మిలిటరీ ఆపరేషన్స్‌లో సిద్ధహస్తుడిగా పేరుంది. మిలటరీ వ్యూహాల రూపకల్పనతో పాటు అమలు, ఆయుధాల వ్యాపారులతో సంబంధాలు కొనసాగించడంలో కీలకపాత్ర పోషించారు. దశాబ్దకాలం పాటు కేంద్ర మిలటరీ కమిషన్ కార్యదర్శిగా సేవలిందించిన ఆయన.. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమలులో కఠినంగా వ్యవహరించేవారని పేరుంది. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్రకర్మతోపాటు మరో 27 మంది దుర్మరణం చెందారు. ఇక 2003 అక్టోబర్‌లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి కేశవరావే. తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద మందుపాతర పేలడంతో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపి.. అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేతలు సహా 33 మందిపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కొందరు నిర్దోషులుగా బయటకు రాగా.. మరికొందరికి శిక్షపడిన విషయం తెలిసిందే.