అమరావతి : ఏపీ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేందుకు పోలీసులు గట్టి నిఘాను పెంచారు. పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకుని మావోయిస్టుల కదలికలను పసిగడుతూ వారిపై దాడులకు దిగుతుండడంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
ఇందులో భాగంగా అల్లూరు జిల్లా పోలీసులు మావోయిస్టు దళానికి చెందిన కీలక కమాండర్‌ను (Maoist Commander ) అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ (SP Amit Bardar ) మీడియాకు వివరించారు.
సుకుమా జిల్లా చింతూరు డివిజన్‌కు చెందిన దళ కమాండర్ సొమడ అలియస్ ముఖేశ్‌ను కల్లెరు ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. సుకుమా జిల్లా గోంపాడుకు చెందిన సొమడ 2014లో మావోయిస్టు పార్టీలో కోవర్టుగా చేరారని వివరించారు. అనంతరం దళ కమాండర్‌గా ఎదిగాడని తెలిపారు. అతడిపై 13 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.