తిరుపతి : తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు వేటూరి ప్రభాకరశాస్త్రి అని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరికే దక్కుతుందన్నారు. ప్రతి క్షణాన్ని లోకకల్యాణం కోసమే వెచ్చించారని కొనియాడారు. వేటూరి ప్రభాకరశాస్త్రి 72వ వర్థంతి తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ‘మణిమంజరి’ సాహితీ సంచికను వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చిన ఘనత వేటూరి ప్రభాకరశాస్త్రిదే అని వీరబ్రహ్మం తెలిపారు. సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన విషయాలు పరిష్కరించి నేటి సమాజానికి ఏవిధంగా ఉపయోగపడతాయో తెలియజేశారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి ఆచార్య రేమిల్ల వెంకటరామక్రిష్ణ శాస్త్రి ప్రసంగిస్తూ.. ప్రాచీన రాగి రేకుల్లోని అన్నమయ్య కీర్తనలను వెలుగు చూడటానికి వేటూరి బాటలు వేశారన్నారు. ఇందులో 35 గ్రంథాలను టీటీడీ ప్రచురించిందని, మరికొన్ని ముద్రణకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు విశ్రాంత ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు సర్వోత్తమరావు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ అద్దంకి శ్రీనివాస్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు డాక్టర్ విభీషణ శర్మ తదితరులు కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్వేత భవనం ఎదురుగా ఉన్న వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి వేటూరి పీఠం పక్షాన పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఉప సంపాదకుడు డాక్టర్ నరసింహాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.