Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన్ను.. రెండు రోజుల పాటు విచారించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సమయంలో నందిగం సురేశ్ తమకు సహకరించలేదని.. కేసు దర్యాప్తు కోసం విచారణ చేసేందుకు ఆయన్ను కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నందిగం సురేశ్‌ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు విచారణ చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. కేంద్ర కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు చంద్రబాబు నివాసంపైనా దాడి చేశారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, నందిగం సురేశ్ సహా పలువురు అనుమానితులపై కేసు నమోదు చేశారు.