Mandous Cyclone : ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. తుపాను నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందని ఆయన చెప్పారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి, అమలు చేయాల్సిన విధివిధానాల గురించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్‌తో కలసి తుపాను కదలికల్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశామని సాయి ప్రసాద్ వెల్లడించారు.
ఉద్రిక్తతను కచ్చితంగా అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నష్టతీవ్రతను తగ్గించగలిగాం అని ఆయన పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామని సాయి ప్రసాద్ తెలిపారు. భారీ వర్షాలు, ఈదుర గాలులు నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి ముందుగానే తుపాను హెచ్చరిక సందేశాలు పంపించామని ఆయన చెప్పారు.
ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో మాండూస్ తుపాను తీవ్రత చూపిందని, లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు సాయి ప్రసాద్ చెప్పారు. 33 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని, 778 మందికి పునరావాసం కల్పించామని ఆయన తెలిపారు. సహాయక చర్యల కోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరుకు-2 మొత్తంగా 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.