కర్నూలు: కౌతాళం మండలం పరిధిలోని కామవరం గ్రామంలో దారుణ హత్యకు గురైన దళత సోదరుల కుటుంబానికి పరిహారం ఇవ్వాలని మాల మహానాడు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. వారికి తక్షణమే రూ.25 లక్షల పరిహారంతో పాటు 3 ఎకరాల భూమి ఇవ్వాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జీ మహానంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కామవరంలో గురువారం చోటుచేసుకున్న భూవివాదంలో ఇద్దరు దళిత సోదరులు చనిపోవడంతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కామవరం గ్రామ సర్పంచ్ శివప్ప, ఆయన సోదరులు ఈరన్న, సత్యప్ప.. వడ్డె మల్లికార్జున ఇంటికి వెళ్లి భూసమస్యపై చర్చలు జరిపి శాంతింపజేశారు. అయితే అనంతరం ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో శివప్ప, ఈరన్న అక్కడికక్కడే మృతి చెందగా, సత్యప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వడ్డె మల్లికార్జున, బోయ మునేంద్ర కుటుంబాల మధ్య గత 22 ఏండ్లుగా భూవివాదం నడుస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
ఈ ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి తిరిగి చేయడానికి ఎవరూ సాహసించకుండా కఠినంగా శిక్షించాలని మాల మహానాడు అధ్యక్షుడు మహానంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. మృతుల కుటుంబీకులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, మూడెకరాల భూమి ఇవ్వాలని, తీవ్రంగా గాయపడిన సత్యప్పకు ప్రైవేట్ దవాఖానలో నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.