Maha Shivaratri Brahmotsavam | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈవో శ్రీనివాసరావు దంపతులు, సంబంధిత అధికారులు, అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్దంగా ఆలయ ప్రాంగణంలోనికి స్వామివార్ల యాగప్రవేశం చేశారు. అనంతరం చతుర్వేదపారాయణలు, వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత లోక క్షేమాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు.
అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజలు నిర్వహించారు. కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుహోమం, రుద్రకలశ స్థాపన, పంచావరణార్చన, జపానుష్ఠాలు జరిపించారు. సాయంత్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి.. సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఆలయప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం పతాకావిష్కరించారు. నూతన వస్త్రంపై పరమశివుడి వాహనమైన నందీశ్వరుడి చిత్రాన్ని తీర్చిదిద్ది.. ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. అంతకు ముందు నందిధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వరస్వామి ప్రత్యేక పూజలు చేసి.. భేరీపూజ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. క్యూలైన్లలో బారులు తీరి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.
Srisailam Temple 02
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ సంప్రదాయ ప్రకారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు శ్రీకాళహస్తి దేవస్థానం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు గురుకుల్ చేరుకోగా.. వారికి శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రవేశం చేసి.. మేళ తాళాల మధ్య స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని శ్రీకాళహస్తి దేవస్థానం కృష్ణారెడ్డి తెలిపారు.