Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లింగోద్భవ కాలంలో జరిపే ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు. హరోం హరా.. హరోం హరా అంటూ భక్తుల నినాదాలతో శ్రీశైల క్షేత్రం మార్మోగుతోంది. ఇల కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో మాత్రమే జరిపే ఈ పాగాలంకరణ సేవ విశిష్టితను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటా రెండు సార్లు బ్రహోత్సవాలు
రాజులు, రాజన్యులు, చక్రవర్తులు, సామాన్యులు సైతం శిరస్సువంచి నమస్కరించే దైవం మల్లికార్జునుడు. ఆ స్వామి మహాలింగ చక్రవర్తిగా భ్రమరాంబతో కూడి శ్రీగిరిని పాలిస్తున్నాడు. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది రెండుసార్లు బ్రహోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మ జరిపించే ఉత్సవాలు కాబట్టి వీటికి బ్రహోత్సవాలు అని పేరు. ప్రతి ఏడాది సంక్రాంతికి ఒకసారి, శివరాత్రికి ఒకసారి ఈ బ్రహోత్సవాలు నిర్వహిస్తారు.
మహాశివరాత్రి బ్రహోత్సవాలు
ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహోత్సవాల వైభవం చెప్పటానికి వీలు కానిది. నవాహ్నిక దీక్షతో పదకొండు రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. బ్రహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వేళ భ్రుంగివాహనం, హంసవాహనం, మయూరవాహనం, రావణవాహనం, గజవాహనం, అశ్వవాహనాల మీద శ్రీస్వామిఅమ్మవార్లు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఆయా ప్రముఖ దేవాలయాల నుంచి శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కూడా జరగటం ఇక్కడి విశేషం. మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది.
పాగాలంకరణ అంటే…
అభిషేకం తరువాత శ్రీస్వామిఅమ్మవార్లకు కళ్యాణమహోత్సవం జరిపిస్తారు. మన సనాతన ధర్మ సంప్రదాయంలో కళ్యాణం ఒక మహాద్భుత ఘట్టం. దేవాలయాల్లో నిత్య కళ్యాణం చేస్తారు. కళ్యాణ సంప్రదాయంలో మొదట వరుడికి మంగళ స్నానాలు చేయిస్తారు. ఆ మంగళ స్నానమే స్వామివారికి చేసే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. స్నానం తరువాత స్వామిని వారిని (వరుడిని) పెండ్లి కొడుకుగా అలంకరించుటలో భాగంగా తలకు పాగా చుట్టడం సంప్రదాయం. ఆ తలపాగా ఎలాగైతే వరుడికి చుడతామో అలాగే స్వామివారి ఆలయ విమాన శిఖరంపై ఉన్న త్రిశూలానికి పాగాను కట్టి ఆలయంపై ఉన్న నందుల కొమ్ములకు పాగాను చుడతారు. ఈ అలంకరణనే పాగాలంకరణ అని పిలుస్తారు.
శ్రీశైలంలో పాగాలంకరణ సుమారు వంద సంవత్సరాలకు పై నుంచి జరుగుతుందని స్థానికుల సమాచారం. ఈ క్షేత్రంలో తప్ప ప్రపంచంలోని ఏ శైవ క్షేత్రంలోను ఇలాంటి ఆచారం లేదన్నది అక్షర సత్యం. పాగాలంకరణ జరిగే సమయంలో క్షేత్రం అంతటా విద్యుత్తు నిలిపివేస్తారు. చిమ్మ చీకటిలో పృథ్వీ వేంకటేశ్వర్ల వారి కుటుంబంలోని ఒక వ్యక్తి దిగంబరంగా ఈ పాగాలంకరణ చేయటం విశేషం. పాగాలంకరణ జరుగుతున్నంత సేపు ఆలయంలో శివనామ స్మరణ, పాగాలంకరణ విశేష వ్యాఖ్యానం జరుగుతుంటాయి. వేలాది మంది భక్తులు ఆలయంలో ఈ ప్రక్రియను భక్తితో వీక్షించడానికి వస్తారు. పాగాలంకరణ పూర్తి అయ్యాక బ్రహోత్సవ కల్యాణం జరిపిస్తారు.
ముక్తికి సోపానం – శ్రీశైల దర్శనం
పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువైన శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రానికి పర్వదినాల సమయంలో ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం నుంచి అడవి మార్గంలో కాలినడకన భక్తులు క్షేత్రానికి చేరుకుంటారు. ఆ సమయంలో అడవంతా శివ నామంతో మార్మోగుతుంది. ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులతో క్షేత్రం కిటకిటలాడుతుంటుంది. కిక్కిరిసిన భక్తులతో శ్రీగిరి శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది.