Maha Shivratri | శ్రీశైలం : శ్రీశైల మల్లికార్జునుడు పెళ్లికొడుకయ్యాడు. మహా శివరాత్రి పర్వదినం రోజున రాత్రి సమయంలో పాగాలంకరణతో వరుడిగా మారాడు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణానికి ముందు పెళ్లికుమారుడిగా తలపాగా చుట్టే కార్యక్రమం ఆనవాయితీగా వస్తున్నది. రాత్రి సమయంలో జరిగిన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి కీలక ఘట్టాన్ని తిలకించారు. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం తరతరాలుగా పాగాలంకరణ చేస్తూ వస్తున్నది. బుధవారం రాత్రి చిమ్మని చీకట్లో వెంకటేశ్వర్లు కొడుకు సుబ్బారావు.. భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారల కల్యాణానికి ముందు సువర్ణ గర్భాలయ కలశంపై నుంచి నవనందులను కలుపుకుంటూ ప్రత్యేక ఆకృతిలో అలంకరించారు. పాగాలంకరణ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో దిగంబరుడైన పృధ్వి వేంకటేశ్వరులు చీకట్లో పాగాలంకరణ చేయడం స్వామివారి భక్తికి నిదర్శనం అని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కఠోర నియమాలతో సంవత్సరాంతం రోజుకో మూరచోప్పున నేసి శివయ్యను పెళ్లి కొడుకును చేసేందుకు ఆభరణంగా ఉపయోగించడం సాంప్రదాయమని అర్చకులు చెప్పారు.
Srisailam Mallanna Pagalankarana
మహాశివరాత్రి రోజున మల్లన్న స్వామికి నిర్వహించే పాగాలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి.. ఆ ఏడాదంతా శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రధాన ఘట్టాలైన పాగాలంకరణ, లింగోద్భవకాల ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వీక్షించుటకు భక్తులు ఆలయ ప్రవేశం చేసేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు. అదే విధంగా పాగాలంకరణ, కల్యాణంలో పాల్గొనే వీఐపీ పాస్‌లతో పాటు సామాన్య భక్తులకు అవకాశం కలింగించామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు లింగోద్భవ సమయంలో గర్బాలయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఆధ్వర్యంలో 11 మంది నిష్ణాతులైన వేదపండితులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం సుమారు నాలుగు గంటల పాటు శ్రీశైల మల్లన్నకు వివిధ రకాల శుద్ధ జలాలు, పండ్లరసాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. పట్టు వస్త్రాలతో సర్వాలంకరణ శోభితులై నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో మండపంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ నేత్రానందకరంగా కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించారు.
Srisailam Mallanna Pagalankarana
Srisailam Mallanna Kalyanam