Maha Shivratri | శ్రీశైలం : ఈ నెల 19 నుంచి శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలై.. మార్చి ఒకటో తేదీ వరకు కొనసాగనున్నాయి. 11 రోజుల పాటు ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం అన్ని ఏర్పాటు చేస్తున్నది. ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు దేవస్థానం అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలని చెప్పారు. 19న ప్రారంభమవుతున్నప్పటికీ.. భక్తుల రద్దీ మూడునాలుగు రోజుల ముందు నుంచే ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక మేరకు బ్రహ్మోత్సవాల్లో ఆయా దర్శనం క్యూలైన్లను నిర్వహించాలని చెప్పారు.
క్యూలైన్ల నిర్వహణలో పోలీస్‌శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లన్ని ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. రద్దీని బట్టి మరిన్ని అదనపు ప్రసాదాల విక్రయకేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అన్ని విభాగాల సిబ్బంది అందరు కూడా సమాచార వినిమయ లోపం లేకుండా సమష్టిగా పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో సరైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు.
పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి తదితర చోట్ల చేయవలసిన ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి కావాలన్నారు. అటవిమార్గంలో చేసే ఆయా ఏర్పాట్లలో అటవీశాఖ వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. అన్నప్రసాదం రుచికరంగా ఉండేలా చూడాలన్నారు. తాజా కూరగాయలనే వినియోగించాలని చెప్పారు. భక్తులరద్దీకనుగుణంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఈవో రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.