Srisailam | శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే పాతాళగంగ వద్ద సాన్నాలు చేసుకొని ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. టైంస్లాట్స్ ప్రకారం.. నిర్ణీత క్యూలైన్ల ద్వారానే దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులు మంచినీళ్ల కోసం ఇబ్బందులుపడ్డారు. నీటి కోసం స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు చేశారు. దాంతో వారంతా ఇబ్బందులు లేకుండా ఇరుముడి సమర్పించి.. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణలు చేస్తున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను దుర్వినియోగం చేయొద్దని ఈవో శ్రీనివాసరావు కోరారు.
జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు కన్నడ భక్తులు ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం క్షేత్ర పురవీధుల్లో పల్లకీపై ఊరేగిస్తూ భజనలు చేశారు. ఆలయ దర్శనానికి వచ్చిన ఆయనకు ఈవో శ్రీనివాసరావుతో పాటు వేదపండితులు ఘన స్వాగతం పలికారు. ఉభయదేవాలయాలతో పాటు పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. జ్యోతిర్లింగ, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలమని పేర్కొన్నారు.