Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన సోమవారం భ్రమరాంబ మల్లికార్జున
స్వామి అమ్మవార్లు పుష్ప పల్లకీలో విహరించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవశక్తి పీఠమైన, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వేడుకలతో ఇల కైలాసాన్ని తలపిస్తున్నది. భ్రామరి సమేతుడైన శ్రీశైలేశుడు సర్వాలంకరణ భూషితుడై పుష్ప పల్లకీలో భక్తులను అనుగ్రహించారు. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివ పంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వేంచేపు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు.
అనంతరం వివిధ రకాలైన ఎర్రబంతి, పచ్చబంతి, చామమంతి, కనకంబరాలు, డచ్ రోస్ అశోక పత్రాల మాలలు, నందివర్ధనం, గరుడ వర్ధనం, కాగడాలు, అస్సెర్ గ్రాస్, గ్లాడియేలస్ మొదలగు పుష్పాలతో అలంకరించిన పుష్ప పల్లకీలో భ్రామరీ సమేత మల్లికార్జునుడు భక్తులను కటాక్షించారు. సాంప్రదాయ మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో గంగాధర మండపం మొదలుకొని నందిమండపం వరకు, నందిమండపం నుంచి క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడి వరకు పురవీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. పుష్పపల్లకిలో విహరిస్తున్న ఆదిదంపతులను దర్శించుకున్నవారు కష్టాలను వీడి సుఖ సంతోషాలతో బాసిల్లుతారని ప్రధాన అర్చకులు తెలిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఈవో తెలిపారు.
నల్లమల అరణ్యంలో సుమారు 40 కిలోమీటర్ల దూరం కాలినడకన సోమవారం నంద్యాల ఎంపీ, లోక్సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. ఆత్మకూరు మండలం వెంకటాపురం మీదుగా అభయారణ్యంలో పాదయాత్రతో బైర్లూటి, నాగలూటి, నెక్కంటి పెచ్చెరువు భీముని కొలను కైలాస ద్వారం మీదుగా రెండురోజుల పాదయాత్రతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం చేరుకొని ముందుగా సాక్షి గణపతి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సోమవారం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఎంపీ శబరి దర్శించుకున్నారు. ఆలయ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో శ్రీశైల దేవస్థానం ఈవో ఘన స్వాగతం దర్శనం అనంతరం వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనం చేసి.. శేషవస్త్రంతో సన్మానించారు.
భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ
శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే ప్రతీభక్తుడుకి లడ్డూ ప్రసాదం అందాలనే భావనతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజులపాటు భక్తులకు లడ్డూ పంపిణీచేయాలని ఆదేశించారు. అమ్మవారి ఆలయ వెనుక భాగంలో పశ్చిమ గోపురం వద్ద ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉచితంగా ప్రసాదాన్ని ఇస్తున్నందుకు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Maha Shivaratri Brahmotsavalu
Maha Shivaratri Brahmotsavalu