Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా భక్తులు సేద తీరడానికి పలు చోట్ల చలువ పందిళ్లు వేస్తున్నారు. సంప్రదాయ బద్ధంగా పూజాధికాలు జరిపి గురువారం ఈ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం నర్సింహారెడ్డి, పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆలయ మాడ వీధులు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ఉద్యానవనాలు, దేవస్థాన సత్ర ప్రాంగణాలు, ఆరు బయలు ప్రదేశాలు మొదలైన చోట్ల ఈ చలువ పందిళ్లు వేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈఓ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేయాలని సూచించారు. అన్ని చోట్ల కూడా తగినంత విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మంచినీటి వసతి కూడా ఉండాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభం అవుతున్నా భక్తులు ముందస్తుగానే క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. కనుక బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఫిబ్రవరి మొదటి వారంలోపే పూర్తి కావాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.