Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో మాఘమాస పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు ఈఓ పెద్దిరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను పల్లకిలో ఆసీనులను జేసి క్షేత్ర ఆలయ ప్రదక్షణలనంతరం క్షేత్ర గిరిప్రదక్షిణ చేశారు. అర్చక వేదపండితులు భక్తులు శివనామస్మరణ చేస్తూ మంగళవాయిద్యాలతో గంగాధర మండపం నుండి నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా శివ నామస్మరణ చేస్తూ సాగిన గిరి ప్రదక్షిణలో యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పౌర్ణమి-శుక్రవారం సంధ్యా సమయంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ, పల్లకి సేవ జరిపించారు.
ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి అష్టోత్తర నామావళిని అర్చకులు పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈఓ పెద్దిరాజు అన్నారు. నిత్య ఆర్జిత సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్షకుంకుమార్చనలో భక్తులు తమ గోత్ర నామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారని తెలిపారు. భక్తులు www.srisailadevasthanam.org <http://www.srisailadevasthanam.org> ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఈఓ పెద్దిరాజు కోరారు.