విశాఖపట్నం: తమ ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషం తీసుకుని అపస్మారకంగా పడి ఉన్న వీరిని స్థానికులు గమనించి దవాఖానకు తరలించగా.. యువతి చనిపోగా.. యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే, నేహా (17), కృష్ణ (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రతిపాదనతో పెద్దలను సంప్రదించారు. వీరి ప్రతిపాదనను ఇరువైపుల తల్లిదండ్రులు నిరాకరించారు. దాంతో జీవితాలను విరమించాలని భావించిన వారు విషం సేవించి స్పృహతప్పి పడిపోయారు. వీరి స్థితిని గమనించిన స్థానికులు వారిని సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. కాగా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు చెప్పారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.