అమరావతి : ఈ నెల 1నుంచి పెంచిన హరితపన్ను వసూలు నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం ఓ లేఖను రాశారు. డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని, రాష్ట్రంలోని రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని ఆ లేఖలో విన్నవించారు. కొవిడ్ వల్ల రవాణా రంగం ఆర్థిక సంక్షోభంలో ఉందని రోజువారీ ఖర్చులు కూడా ఇబ్బందిగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యావరణాన్ని కర్బన ఉద్గారాల నుంచి కాపాడే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం గత నవంబర్ నెలలో మోటార్ టాక్స్ నిబంధనల్లో మార్పును తీసుకువస్తూ గ్రీన్ ట్యాక్స్ బిల్లును జనవరి 1నుంచి అమలులోకి తీసుకొచ్చింది . ఈ బిల్లు ప్రకారం రిజిస్ట్రేషన్ తేదీ నుంచి ఏడు నుంచి 10 సంవత్సరాలు పూర్తి చేసిన రవాణా వాహనాల విషయంలో సంవత్సరానికి రూ. 4వేలు గ్రీన్ ట్యాక్స్‌గా చెల్లించాలని ఉత్తర్వులు వెలువరించింది.
వాహనం 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉంటే రూ. 5వేలు, రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 12 సంవత్సరాల కంటే పాత వాహనాలపై సంవత్సరానికి రూ.6 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో వాహనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.