తిరుమల: రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల కొండపై శ్రీనివాసుడు వివిధ వాహనాల్లో దర్శనమిస్తున్నాడు. ఇవాళ ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించని శ్రీవారు.. అనంతరం గరుడ వాహనంపై వేంచేశారు. స్వామి వారిని దర్శించుకుని భక్త కోటి పులకించిపోయారు. రథ సప్తమి సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహిస్తారు.
రథ సప్తమి పర్వదినం సందర్భంగా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో సకలలోక రక్షకుడైన శ్రీనివాసుడు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై అనుగ్రహించారు. గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఉన్నది.
గరుడ వాహన సేవలో టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు మారుతీ ప్రసాద్, రాములు, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, అధికారులు జగదీశ్వర్ రెడ్డి, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకోవడంతో.. సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి.