Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడున్నారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. హైదరాబాద్ నుంచి గన్నవరం బయల్దేరిన ఆయన్ను పోలీసులు వెంబడించి మరీ అరెస్టు చేశారని రెండు రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వదంతులేనని ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదని మళ్లీ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన ఎక్కడకు వెళ్లారనేది కనుక్కోవడానికి లుక్ఔట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
వల్లభనేని వంశీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వెల్లడించారు. ఆయన ఆచూకీని కనుగొనేందుకు విశాఖపట్నం, హైదరాబాద్, బళ్లారి, బెంగళూరుకు పోలీసు బృందాలను పంపించినట్లు తెలిపారు. వంశీ దగ్గరి బంధువులు, స్నేహితులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. లుక్ఔట్ నోటీసులు ఇచ్చారా? లేదా? అన్న దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. కేసు దర్యాప్తులో ఉన్నందున పూర్తి వివరాలను వెల్లడించమని చెప్పారు.
కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో అరెస్టు చేస్తారనే సమాచారంతో వల్లభనేని వంశీ ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఆయన ఆమెరికా వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నాయకులపై దాడి చేశారు. అనంతరం వారి వాహనాలను తగులబెట్టారు. దాదాపు 5 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కాకపోతే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ప్రోద్బలంతోనే వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసును సీరియస్‌గా తీసుకుంది.
టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ఇప్పటికే 18మందిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా వంశీని అదుపులోకి తీసుకున్నారు.