AP News | సాధారణంగా దొంగలంటే డబ్బులు, నగలు దోచుకెళ్తారు.. లేదంటే ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్తారు.. కానీ ఏపీలో మాత్రం ఓ వింత దొంగ దొరికాడు. రాత్రిపూట ఇంటి బయట మహిళల జాకెట్లు ఆరేసి ఉంటే చాలు.. వాటిని ఎత్తుకెళ్లిపోతాడు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ వింత దొంగను గ్రామస్తులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం దర్బరేవులో కొంతకాలంగా వింత దొంగతనాలు జరుగుతున్నాయి. ఆరు నెలల నుంచి బాత్రూమ్ల్లో, ఇంటి బయట ఆరేసిన జాకెట్లు తెల్లవారేసరికి మాయమవుతున్నాయి. దీంతో కోతులు, లేదంటే ఏవైనా జంతువులు ఎత్తుకెళ్తున్నాయేమో అని గ్రామస్తులు భావించారు. కానీ అదే సీన్ రోజూ రిపీట్ అవుతూ దాదాపు 300 కి పైగా జాకెట్లు మాయమవ్వడంతో ఆ గ్రామంలో కలకలం రేగింది. దీంతో ఎలాగైనా ఈ మిస్టరీని చేధించాలని గ్రామస్తులంతా నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఒకతను సంచి పట్టుకుని అనుమానాస్పదంగా వెళ్తుండటంతో అతన్ని పట్టుకున్నారు.
ఆ వ్యక్తి సంచిలో చెక్ చేయగా దాని నిండా జాకెట్లు కనిపించాయి. అది చూసి గ్రామస్తులు షాకయ్యారు. అతనే జాకెట్ల దొంగ అని నిర్ధారించుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. తనది వేములదీవి గ్రామమని చెప్పాడు. ఇప్పటివరకు వందల సంఖ్యలో జాకెట్లు దొంగతనం చేసినట్లు బయటపెట్టాడు. వాటన్నింటి ఏం చేస్తున్నావని అడగ్గా.. దగ్గరలోని కాల్వలో పడేస్తానని చెప్పాడు. ఎందుకలా చేస్తున్నావని పోలీసులు నిలదీయగా.. అది తన బలహీనత అని చెబుతూ కాళ్లపై పడ్డాడు. దీంతో ఆ దొంగ మానసిక రోగిలా ఉన్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.