Nadendla Manohar | మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని విమర్శించారు. మంగళగిరిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఊహించని రీతిలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీసం పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఇంత ఏడుపా అని ప్రశ్నించారు. జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్‌కు లేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కల్యాణ్ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. పిఠాపురంలో పర్యటించిన వైఎస్ జగన్ అక్కడ కాలనీలు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని అన్నారు. ఎక్కడ కష్టమొచ్చినా జన సైనికులు ముందుంటున్నారని పేర్కొన్నారు.
లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లా స్పందించే మనసు ఉండాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. నిన్న పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞానిలాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారని విమర్శించారు. కాగితాలు చేతిలో పెట్టుకుని ఊగిపోతే.. షోమెన్ తప్ప.. లీడర్ అనిపించుకోలేరని స్పష్టం చేశారు.