ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు శాంతియుతంగా కొనసాగిస్తున్న మహాపాదయాత్రపై ప్రకాశం జిల్లా చదలవాడలో పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నారు. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి సీఎం జగన్కు చలిజ్వరం చుట్టుకుందని విమర్శించారు.
హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకు ఆంక్షలు విధించడం శోచనీయమని పేర్కొన్నారు. రైతులు నిస్వార్థంగా మహాపాదయాత్ర చేస్తుంటే ఎన్నికల కోడ్ ఆపాదించి అడ్డుకోవాలని చూడటం కోర్టు ఆదేశాలను ధిక్కరించటమేనని వారు అన్నారు. బారికేడ్లతో పాదయాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. లాఠీఛార్జికి పాల్పడ్డ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వారు డిమాండ్చేశారు. రైతుల ఉద్యమం ఆగాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాల్సిందేనని వారు తెలిపారు.