Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వస్తున్న యాత్రికులకు అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించడంతోపాటు క్షేత్ర అభివృద్దికి పాటు పడుతున్న దేవస్థానం ఈవో లవన్న ప్రణాళికలను కృష్ణ ధర్మ రక్షణ సమితి నిర్వాహకులు అభినందించారు. ఈ మేరకు ఈవో లవన్నను కృష్ణ ధర్మ రక్షణ సమితి నిర్వాహకులు సత్కరించి ప్రశంశా పత్రాన్ని అందజేశారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, స్థానిక ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని సంస్థ నిర్వాహకులు ఈవో దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధానంగా గణేష్ సదనంలో వసతి గదుల ప్రారంభం, పాతాళగంగ వెళ్ళే రోడ్డుమార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈవోను కృష్ణ ధర్మ రక్షణ సమితి నిర్వాహకులు కోరారు. కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉండకుండా ట్యాగ్‌లైన్ విధానాన్ని అమలుపరిచే వెసులుబాటు కల్పించాలని కోరారు. గతంలో కంటే కూడా భక్తులకు వసతులు కల్పించడంలో ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుని అధికారులు సిబ్బంది వాటిని అమలుపరిచేలా పర్యవేక్షిస్తున్న ఈవోకు కృష్ణ ధర్మ రక్షణ సమితి కృతఙ్ఞతలు తెలిపింది.