తిరుమల : తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 7 న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాల సందర్భంగా జనవరి 7వ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని టీటీడీ (TTD) ఆలయ అధికారులు వివరించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారని వెల్లడించారు.
ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి , శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని తెలిపారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో ఒకరోజు ముందుగా 6వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల వల్ల అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు . నిన్న స్వామివారిని 59,564మంది భక్తులు దర్శించుకోగా 24,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.18 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.