తిరుపతి : తిరుపతి (Tirupati) శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) భాగంగా ఐదో రోజు సోమవారం శ్రీరామచంద్రుడు మోహినీ అవతారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరిగిన ఉత్సవంలో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారని, చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుందని, దానిని పంచుకోవడంలో కలహంలో అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడని అన్నారు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ మోహినీ రూపం తెలియజేస్తుందన్నారు. అనంతరం ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు గరుడసేవ నిర్వహించనున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,263 మంది భక్తులు దర్శించుకోగా 25,733 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.65 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.