గుంటూరు : వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏపీ మంత్రివర్గంలో చేరిన తర్వాత, మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత చంద్రబాబును టార్గెట్గా చేసుకున్న కొడాలి నాని.. ప్రతిసారి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వైసీపీ ప్లీనరీలో ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై మళ్లీ ఘాటుగా విమర్శించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని కొడాలి నాని చెప్పారు. దేశంలో చంద్రబాబు అంతా చవట, దద్దమ్మ లేనేలేరని విరుచుకుపడ్డారు. చంద్రబాబు 420 అని, ఆయనకు భయపడే వారు ఎవరూ లేరని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన వ్యక్తిగా సీఎం జగన్ నిలిచిపోతారన్నారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ భగ భగ మండే సూర్యుడులాంటోడని అన్నారు. అసెంబ్లీలో జరగని దానికి చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చాడని, చంద్రబాబు భార్యను ఎవరు కూడా ఏమీ అనలేదని చెప్పారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేస్తే విషపు రాతలు రాస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.
తన రాజకీయాలకు రాజారెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు వదల లేదని.. చివరకు జగన్ బిడ్డ పేరు కూడా ఎత్తాడని కొడాలి నాని మండిపడ్డారు. పుట్టిపెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచాడా అని ప్రశ్నించారు. 2024లో చంద్రబాబును రాజకీయ సమాధి చేస్తామన్నారు. మానసిక వైద్యశాల ఏర్పాటు చేసి.. అందులో చంద్రబాబును చేరుస్తామని, అలాగే దుష్టచతుష్టయాన్ని కూడా మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించాలన్నారు.