Kidney Rocket | ఏపీలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయ్యింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బయటకొచ్చింది. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అనుమానితులను అరెస్టు చేశారు.
అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్ డాక్టర్ ఆంజనేయులు కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మదనపల్లె డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ కేంద్రం మేనేజర్ వెంకటేశ్ నాయక్ కూడా ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా ద్వారా కిడ్నీ మార్పిడికి డాక్టర్ శాశ్వతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డయాలసిస్ సెంటర్‌కు వచ్చే ధనవంతులను డాక్టర్ శాశ్వతి గుర్తించి, డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకు తెరతీశారు. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేశ్ కలిశారు. కిడ్నీ ఇస్తే రూ.8లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. మదనపల్లెలోని గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ సేకరించి, గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి కోసం ఈ నెల 9న ఆపరేషన్ చేస్తుండగా.. మూర్చ రావడంతో యమున మృతిచెందింది.
యమున మృతిచెందిన విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకులు దాచిపెట్టడానికి ప్రయత్నించారు. యమున మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచే 112కి ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లె టూ టౌన్ పోలీసులు గ్లోబల్ ఆస్పత్రిపై తనిఖీ చేశారు. అక్కడే ఉన్న మదనపల్లె డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ మేనేజర్ వెంకటేశ్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వైజాగ్‌కు చెందిన ముగ్గురు బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.