AP Inter Exams | ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈసారి సీబీఎస్ఈతో పాటుగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అంటే నెల ముందుగానే పరీక్షలను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఏప్రిల్లోనే తరగతులు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈసారి ఇంటర్ పరీక్షల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఇంతకుముందు లాంగ్వేజ్ పరీక్షలు ముందుగా నిర్వహిస్తుండగా.. ఇప్పటి నుంచి గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి. అంటే.. సైన్స్ గ్రూపు విద్యార్థులకు ఆ పరీక్షలే ముందు జరుగుతాయి. సైన్స్ గ్రూపు సబ్జెక్టుల పరీక్షలు అన్నీ పూర్తయిన తర్వాత చివరల్లో లాంగ్వేజ్ పరీక్షలు ఉంటాయి. అనంతరం ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి.
ఇక రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్షే ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు బైసీపీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే.. ఆ రోజు ఆ ఒక్క పరీక్షే ఉంటుంది. బయోలజీ సబ్జెక్టుకు వేరే రోజు పరీక్ష ఉంటుంది. ఎంబైపీసీ గ్రూపును కొత్తగా తీసుకురావడంతో.. ఎంపీసీ విద్యార్థులు కూడా బయాలజీ చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు.. కాబట్టి ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరలో నిర్వహించాలా? రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.