హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చరిత్ర సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 165 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ఏపీ చరిత్రలోనే ఇది భారీ మెజార్టీ కాగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం తదితర అంశాలపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 25 నియోజకవర్గాలకు ఏకంగా 21 సీట్లను కూటమి కైవసం చేసుకున్నది. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలు గెలుచుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి తన రాజీనామాను గవర్నర్‌కు పంపగా ఇప్పటికే ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు చంద్రబాబు ఇల్లు, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. కాన్వాయ్‌ని సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లి ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు.
ఏపీలో మ్యాజిక్ ఫిగర్ 88 కాగా టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135 చోట్ల విజయం సాధించింది. దీనిద్వారా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యను సాధించింది. మిత్ర పక్షాలైన జనసేన 21 చోట్ల పోటీ చేసి అన్నిచోట్లా గెలుపొందగా, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లలో గెలిచి ఉనికి చాటుకున్నది. ఈ ఎన్నికల్లో ‘వై నాట్ 175’ అంటూ ప్రచారం చేసిన వైసీపీ బొక్కబోర్లాపడింది. కంచుకోట రాయలసీమ బద్ధలుకాగా, కోస్తాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాంధ్ర కూడా ఆదుకోలేదు. దీంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీల అధినేతల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో 47వేల ఓట్లతో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలో 91వేలతో, పిఠాపురంలో పవన్ కల్యాణ్ 69,169 ఓట్లతో, పులివెందులలో వైఎస్ జగన్ 61,176 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఏపీలో మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాలను కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఎనిమిది జిల్లాల్లో కలిపి 110 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో 9, తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమగోదావరి జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 14, నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు కూటమికే జై కొట్టాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు మరోసారి నిజమయ్యాయి. వైసీపీ విశాఖప ట్నం, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకే పరిమితమైంది.
ఐదు జిల్లాల్లో 65 నియోజకవర్గాలుండగా 55 సీట్లు కూటమి గెలుచుకోవడం విశేషం. కడపలో 3, విశాఖ, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రెండు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఒక స్థానాన్ని వైసీపీ గెలిచింది. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులంతా ఓటమిపాలయ్యారు. జగన్, పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోవడం గమనార్హం. ఇందులో ధర్మాన ప్రసాదరావు, బొత్సా సత్యనారాయణ, అంబటి రాంబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేశ్, తానేటి వనిత వంటివారున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలో దిగి విజయఢంకా మోగించారు. తకువ స్థానాల్లో పోటీ చేసి 98 శాతం స్రె్టైక్ రేటు సాధించాలని భావిస్తున్నాం’ అని చెప్పారు. పవన్ అంచనాలను నిజం చేస్తూ 98 శాతం కాదు.. ఏకంగా 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో జనసేన రికార్డు సృష్టించింది.