తిరుపతి : ఈనెల 18న తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తిక దీపోత్సవం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ జేఈవో సదాభార్గవి బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తిక దీపోత్సవ విశిష్టతను, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
18న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు దీపోత్సవం జరుగుతుందన్నారు . మైదానంలో 1800 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీపోత్సవాన్నికి విచ్చేసే మహిళలకు తులసి మొక్కలు అందించాలని సూచించారు. ఇంజినీర్ విభాగం స్టేజీ, బారికేడ్లు, ఇతర ఇంజినీర్ పనులను ముందుస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు. మైదానంలో ఎల్ఇడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు.
పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్, ఎస్ఇ – 2 జగదీశ్వర్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.