Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు దర్శనాలు భక్తులకు దర్శనాలు కొనసాగాయి. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యథావిధిగా దర్శనాలు కొసాగాయి. రుద్రహోమం, మృత్యుంజయహోమం రెండువిడుదతలుగా జరిపించారు. పలువురు భక్తులు పుష్కరిణి, పాతాళగంగలో స్నానాలు చేసి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.
పలువురు నదిలో కార్తీక దీపాలను వదిలారు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు మంచినీరు, అల్పాహారం అందించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అందరికీ దర్శనాలు కల్పించేందుకు వీలుగా ఆలయ అధికారులు గర్భాలయ ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. అలాగే, రద్దీ రోజుల్లో స్వామివారి స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నారు. కాగా, సాధారణ రోజుల్లో రోజుకు మూడు విడతలుగా ఆర్జిత అభిషేకాలు, స్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. స్పర్శదర్శనం టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించున్నట్లు తెలిపారు. భక్తులు కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఉత్తరమాడవీధి, గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న కార్తీకపౌర్ణమి సందర్భంగా పాతాళగంగలో పుణ్యనదీహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్చార్జి ఈవో వేంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేని విగ్రహానికి పూజాధికాలు, సారె సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
అదే రోజున సాయంత్రం ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు సాయంత్రం ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి రోజుల్లో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వివరించారు. సోమవారాలు, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, జ్వాలాతోరణోత్సవం, నదీహారతి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రద్దీ రోజుల్లో భక్తులకు సేవలందించేందుకు వీలుగా సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు.