తిరుమల: కర్ణాటక సంగీత పితామహులు శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలుజనవరి 31నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నారు. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుగనున్నాయి. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.మొదటిరోజైన జనవరి 31నతిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు హరిదాస రంజని పేరుతో కళాకారులతో భజన సంగీత కార్యక్రమం, పండితులతో ధార్మికోపన్యాసాలు జరుగుతాయి.
రెండవ రోజైన ఫిబ్రవరి 1న మంగళవారం ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం వద్దగల వైభవోత్సవ మండపానికి శ్రీవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా శ్రీ పురందరదాస సంకీర్తనల బృందగానం నిర్వహిస్తారు. చివరిరోజు ఫిబ్రవరి 2న బుధవారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు తిరుమల ఆస్థానమండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.