Srisailam | ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, అయోధ్య, హరిద్వార్‌లలో నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం శ్రీశైలంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. సత్రం అధ్యక్షులు ఎన్ ఆర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్ వేణుగోపాల్, గౌరవ అధ్యక్షులు కామరాజు నరేంద్రకుమార్, కే వీ ప్రదీప్ తదితరులతో పాటు సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పటికే దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కరివేన నిత్యాన్నదాన సత్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం, అయోధ్య, హరిద్వార్‌లలో తాత్కాలికంగా అద్దె భవనాల్లో సత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత శాశ్వత భవనాలని నిర్మించాలని ఈ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలంలో మరో భవనాన్ని నిర్మించాలని, అరుణాచలం, భద్రాచలంలలో కొత్త భవనాలు నిర్మించాలని కూడా తీర్మానించారు. గంగా నది పుష్కరాల సందర్భంగా కాశీ, హరిద్వార్‌లలో భక్తులకు అన్నదానంతోపాటు, ఇతర సేవలను అందించాలని నిర్ణయించారు.