Kanipakam | కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్. సోమశేఖర్ గురుకుల్‌ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆలయ ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎస్.గణేశ్ గురుకల్ను ఇంచార్జి ప్రధాన అర్చకుడిగా నియమించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అర్చకుడిగా ఉద్యోగం పొందే సమయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంతో పాటు.. వాటితో పదోన్నతులు పొందారని సోమశేఖర్‌పై ఆరు నెలల క్రితం లాయర్ రవికుమార్ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తప్పుడు ధ్రువీకరణ పత్రాల విషయాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని దేవాదాయ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన అధికారులు.. సోమశేఖర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లుగా నిర్ధారించారు. సోమశేఖర్‌ను ఆలయ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి సస్పెండ్ చేశారు.