AP News | ఆ యువకుడే తన సర్వస్వం అనుకుంది ఆ అమ్మాయి.. తనతోనే నూరేళ్ల జీవితం గడపాలని ఆశపడింది. కానీ ఆ అబ్బాయి మాత్రం అవసరాలను తప్ప ఆమెలోని ప్రేమను గుర్తించలేదు. తన కోరిక తీరగానే వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ముఖం చాటేశాడు. నువ్వు లేకుండా నేను బతకలేనని చెబితే.. ఛస్తే చావమని పురుగుల మందు కొనిచ్చాడు.. ఇన్నాళ్లూ తన వాడు అనుకునే వాడే చావమనడంతో ఆ బాధతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని యు.కొత్తపల్లికి చెందిన ఉమామహేశ్వరరావుకు కాకినాడ గొడారి గుంటకు చెందిన యువతి (24)తో ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. 2017లో వీరిద్దరికి పరిచయమవ్వగా.. కొంతకాలానికే ఇద్దరూ ప్రేమగా మారింది. ఉమామహేశ్వరరావు ప్రేమలో పడిపోయిన ఆ యువతి అతనితో ఎంతో చనువుగా ఉంది.కొంతకాలం కిందట తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించాలని భావించి పెళ్లి చేసుకోమని ఉమామహేశ్వరరావును కోరింది. దీనికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ బుకాయించాడు. తన కోరిక తీరగానే ఉమామహేశ్వరరావు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.
వేరే యువతితో ఇటీవల ఉమామహేశ్వరరావు నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యామిని ప్రియుడిని నిలదీసింది. నువ్వు వేరే అమ్మాయిని చేసుకుంటే నా సంగతేంటి? అని ప్రశ్నించింది. తనను ఎందుకు మోసం చేశావంటూ బాధపడింది. నువ్వు లేకపోతే బతకలేనని.. పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. కానీ ఉమా మహేశ్వరరావు మాత్రం ఆమె బాధను అర్థం చేసుకోలేదు. ఛస్తే చావు గానీ.. నా పెళ్లికి అడ్డురావద్దని కరాఖండీగా చెప్పేశాడు. దీంతో ప్రేమలో మోసపోయానన్న బాధలో పురుగుల మందు కొనుక్కోవడానికి ఫెర్టిలైజర్ షాపునకు వెళ్లింది. ఆమె వెనకాలే వెళ్లిన ఉమామహేశ్వరరావు పురుగుల మందుకు డబ్బులు చెల్లించి వెళ్లిపోయాడు.
ఇన్నాళ్లూ ప్రేమించిన వాడే తనను చావమని చెప్పడంతో కుమిలిపోయిన సదరు యువతి పురుగుల మందు తాగేసింది. కుమార్తె మృతి తర్వాత ఆమె ఫోన్లో మెసేజ్లు చూసిన తల్లిదండ్రులు ఉమామహేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నాడు ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు.