Gold Medal | జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెం.1 సినిమా గుర్తుందా.. ఆ సినిమాలో ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఎన్టీఆర్ జైలులో ఉండే న్యాయ విద్యను అభ్యసిస్తాడు. ఇప్పుడు అలాంటి ఘటనే రియల్ లైఫ్‌లోనూ జరిగింది. ఓ హత్యకేసులో కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూనే ఓ ఖైదీ నాలుగు డిగ్రీలు, మూడు పీజీలు పూర్తి చేశాడు. పైగా గోల్డ్ మెడల్ కూడా సాధించాడు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన చంగమ్మ కుమారుడు యుగంధర్‌కు 2011లో ఓ హత్య కేసులో జైలుశిక్ష పడింది. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో అతనికి శిక్ష పడింది. దీంతో దాదాపు 15 ఏళ్లుగా కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న యుగంధర్.. చదువు మీద ఆసక్తితో ముందుగా అంబేద్కర్ దూరవిద్య ద్వారా ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత పాత సిలబస్ ప్రకారం రెండు బీఏలు, కొత్త సిలబస్ ప్రకారం మరో రెండు బీఏలు పూర్తి చేశాడు. అనంతరం మూడు ఎంఏలు చదివాడు. వీటితో పాట మూడేళ్ల పాటు జైల్లో పారా మెడికల్ వాలంటీర్‌గా పనిచేశాడు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశాడు. ఇందులో 8.02 జీఏపీ సాధించి గోల్డ్ మెడల్క ఎంపికయ్యాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే అంబేద్కర్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవంలో పాల్గొని గోల్డ్ మెడల్ అందుకోవాలని యూనివర్సిటీ నుంచి యుగంధర్‌కు ఆహ్వానం అందింది. కాగా, దాదాపు 15 ఏళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టాలని యుగంధర్ తల్లి చంగమ్మ.. ప్రభుత్వాన్ని, అధికారులు వేడుకుంటున్నారు. ‘నా కొడుకు 15 ఏళ్లుగా జైలులోనే ఉన్నాడు. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇటీవల నా భర్త చనిపోయాడు. నన్ను చూసుకునేవాళ్లెవరూ లేరు. ప్రభుత్వం స్పందించి నా కొడుకుకు క్షమాభిక్ష ఇస్తే ఈ వయసులో నాకు అండగా ఉంటారు. యుగంధర్ క్షణికావేశంలో చేసిన తప్పునకు ఇప్పటికే ఏళ్లతరబడి జైలులో మగ్గుతున్నాడు. దయచేసి నా కొడుకును నా దగ్గరకు చేర్చండి’ అని చంగమ్మ వేడుకుంటున్నారు.