Kadambari Jathwani | సోషల్‌మీడియాలో తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టవద్దని అందర్నీ విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టిన తప్పుడు కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను జత్వానీ సోమవారం బయటపెట్టారు. చాటింగ్ వివరాలు, తన ఆధార్ కార్డు ఫోర్జరీ జరిగిన విధానం, పోలీసు అధికారుల ప్రమేయం సహా వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కాదంబరి జత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని విజ్ఞప్తి చేశారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు సాకుతో కొంతమంది అధికారులు కూడా తనతో నీచంగా ప్రవర్తించారని తెలిపారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడు ఆ అధికారులు విద్యాసాగర్‌కు ఎందుకు కొమ్ముకాశారని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం పోలీసులు, తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని జత్వానీ అన్నారు. అయితే ఈ కేసులో తనపై సోషల్‌మీడియాలో నీచ ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన వారికి శిక్షపడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని తనకు న్యాయం చేయాలన్నారు. తనకు అండగా నిలిచిన మహిళా సంఘాలందరికీ జత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.