KA Paul | వైఎస్ జగన్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పీపీపీ కాదని.. పీపీబీ (బిలియనర్ల ప్రోగ్రామ్) అని ఆరోపించారు.
మెడికల్ కాలేజీలను నారాయణ కొన్నా, మరెవరు కొన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేఏ పాల్ హెచ్చరించారు. ఈ విషయమై తాను హైకోర్టులో పిల్ దాఖలు చేశానని తెలిపారు. పీపీపీ విధానం వల్ల కర్ణాకటలో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయాని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను 33 ఏళ్ల లీజు పేరుతో అమ్మేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నట్టే మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారని అన్నారు. క్యూబా లాంటి చిన్న దేశంలోనే ఉచిత విద్య, వైద్యం అందుబాటులో ఉందని.. మన దగ్గర ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
పాలించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తనకు తెలుసని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి ఘటనపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. వైజాగ్ సమ్మిట్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని.. దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.