JC Prabhakar Reddy | అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లేందుకు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అనుమతి ఇచ్చినా సరే టీడీపీ నాయకుడు పొట్టి రవిని తాడిపత్రిలోకి రానివ్వలేదని ఆయన గుర్తుచేశారు. అయినా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్నది తాను కాదని.. ఆయన వల్ల నష్టపోయిన బాధితులే అని వ్యాఖ్యానించారు.
అధికారం అడ్డంపెట్టుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా అక్రమాలు, దౌర్జన్యాలు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మహిళలు అని కూడా చూడకుండా టీడీపీ మహిళా కౌన్సిలర్లను పరిగెత్తించిన కొట్టిన ఘనత పెద్దారెడ్డిది అని విమర్శించారు. వైసీపీ హయాంలో పోలీసుల అండతో చాలామంది టీడీపీ కార్యకర్తలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, జిల్లా బహిష్కరణ చేశారని మండిపడ్డారు. తాడిపత్రిలో రాజకీయాలు చేయడానికి పెద్దారెడ్డి కుటుంబానికి అర్హత లేదని అన్నారు.
తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు నిన్న అనుమతినిచ్చింది. ఆయన తాడిపత్రికి వెళ్లకుండా ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన ధర్మాసనం.. అవసరమైతే ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకోవాలని సూచించింది. కేతిరెడ్డికి అవసరమైన సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులకు ఆదేశించింది. ఈ క్రమంలో కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తొందరలోనే తాడిపత్రికి వెళ్తానని తెలిపారు. సుప్రీంకోర్టు కాపీలను ఎస్పీకి అందజేస్తానని చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు.