అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జన్మభూమి-2 (Janmabhoomi-2 ) ను ప్రారంభించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో (Polit Bureau meeting) సమావేశం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టాలని, ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా చేపట్టాలని, త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించాలని, పేదరిక నిర్మూలనపై చర్చ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రభుత్వానికి ఇస్తున్న సమయాన్ని అంతే స్థాయిలో పార్టీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ ఘన విజయం ఇచ్చిన ప్రజలకు,ఎన్టీయే పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పైరవీకు తావులేకుండా, కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పార్టీలో పెట్టి చర్చిస్తామన్నారు. కూటమిలో సభ్యులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయని అన్నారు.