వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా… బీజేపీని కూడా ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీ బాగుండాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా వుండాలని, దీని విషయంలో ఓ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని తాము భావిస్తున్నామని పవన్ ప్రకటించారు. ఈ విషయాలన్నీ బీజేపీ హైకమాండ్‌కు అర్థమయ్యేలా జాగ్రత్తగా వివరిస్తానని పేర్కొన్నారు. అమరావతి మాత్రమే ఏపీ రాజధానిగా వుండాలని, బీజేపీ ఎలా మెప్పించానో, అలాగే పొత్తుల విషయంలోనూ అలాగే ఒప్పిస్తానన్న నమ్మకం ఉందదని తెలిపారు.
ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయంలో వైసీపీ తమకు సలహాలివ్వడం ఏంటని మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవర్ని మంత్రి మండలిలోకి తీసుకోవాలో తాము సూచిస్తే వింటారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వం అన్నది చాలా చిన్న పదమని, దీనికి వైసీపీ ఎందుకంత భయపడుతుందో అర్థం కావడం లేదన్నారు. తనను ఓడిస్తానన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని పవన్ సంచలన ప్రకటన చేశారు.
మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా మధ్యలో కరెంట్ పోయింది. దీంతో సెల్ఫోన్ల వెలుగులోనే పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.