హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు. జాహ్న వి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. నాసా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రొగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.
జాహ్నవి అమెరికాలో టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కు ఎంపికైంది. నాలుగేండ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా జాహ్నవి అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ ఉద్యోగరీత్యా కువైట్లో ఉంటున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన జాహ్నవి ఇంటర్ వరకు తన స్వగ్రామమైన పాలకొల్లులో చదువుకున్నారు.