అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల అజెండాతో ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయనట్లుగా ఉద్యోగులకు మేలు చేస్తున్నామని, అయితే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ప్రభుత్వం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఉద్యోగులను ఉసిగొల్పుతున్న చంద్రబాబు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
‘జగనన్న చేదోడు’ రెండో వార్షిక నగదు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకే సమ్మె చేయాలని ఎగదోస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు ఇలా చేయడం మంచిది కాదని, వారి మాటలు నమ్మవద్దని ఉద్యోగులను కోరారు. కరోనా వైరస్ విజృంభణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ అన్నారు.