అమరావతి : ఏపీలో వైఎస్ వివేకానందా(Viveka Murder Case) హత్యను రాజకీయాలకు వాడుకుని లబ్దిపొందిన వైఎస్ జగన్( YS Jagan) , మళ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం వివేకా పేరును వాడుకుంటున్నారని వివేకా కూతురు సునీత (Sunitha) విమర్శించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని, దీన్ని నుంచి బయటకు రాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పును ప్రశ్నించకపోతే రాబోయే సమాజానికి మంచిది కాదని ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. అదే తాను చేస్తున్నానని అన్నారు. నేను, షర్మిల ఎవరి ప్రభావంతోనే మాట్లాడుతున్నామని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టించి అవినాష్ (Avinash) పై మాట్లాడించింది మీరే కదా? అంటూ ప్రశ్నించారు. ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చు. పదేపదే చేయలేరనేది గ్రహించాలని సూచించారు.
వైఎస్ వివేకానందాను చంపింది ఎవరు. చంపించింది ఎవరో జగన్‌కు తెలుసని బాధ్యతగా ముఖ్యమంత్రి వారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. వివేకా హత్యలో నిందితుడు అవినాష్‌ను జగన్ కాపాడుతున్నారని, ఎందుకు కాపాడుతున్నారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్ అరెస్టయితే హత్య వెనుక ఉన్న పేర్లు బయటకు వస్తాయని భయపడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని వెల్లడించారు.
కడప నుంచి షర్మిల పోటీ అభినందనీయం
వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక ఎంపీని, 15 మంది ఎమ్మెల్యేలను షర్మిల (Sharmila) గెలిపించారని, ఆ విషయం జగన్ మరిచిపోయారని గుర్తు చేశారు. వైఎస్ ప్రస్థానం పేరిట ఎండనక, వాననక షర్మిల పాదయాత్ర నిర్వహించి వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి గెలిపిస్తే ఆమెను పక్కన పెట్టారని ఆరోపించారు. షర్మిల కడప(Kadapa) ఎంపీ స్థానానికి పోటీ చేయడం అభినందనీయమని అన్నారు. వివేకా ఆశయాలకు అనుగుణంగా షర్మిల అదే స్థానం నుంచి పోటీ చేయడం గర్వంగా ఉందని అన్నారు. వివేకం సినిమాను చాలా ధైర్యంగా నిర్మించారని, చివరి అరగంట భయంగా ఉంది. వాస్తవ ఘటనలు ఇంకా ఘోరంగా ఉన్నాయని పేర్కొన్నారు.