YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన భదత్ర తగ్గించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సీఎంగా వైదొలిగిన జూన్ మూడో తేదీ నాటి భద్రతను తనకు కొనసాగించాలని కోరుతూ జగన్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే టీడీపీ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని 59 మందికి తగ్గించివేసిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితులు, రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని తన భద్రత కొనసాగించాలని వైఎస్ జగన్ కోరారు. టీడీపీ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తన భద్రత తగ్గింపుతో తన సేఫ్టీపై ఆందోళన కలుగుతున్నదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోపే తన భద్రతను కుదించడం ద్వారా సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని ఆరోపించారు.
అధికారికంగా తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా భద్రతా సిబ్బందిని కేవలం ఇద్దరికి పరిమితం చేశారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆ ఇద్దరు భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 139 మంది భద్రతా సిబ్బందితో జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారని ఆయన గుర్తు చేశారు.