అమరావతి : వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కు వ్యవసాయంపై అవగాహన లేక కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ( Minister Achchennaidu) ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ మొదటివారంలో భారీవర్షాలు, వరదల (Floods) వల్ల రాష్ట్రంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు.
నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారాన్ని (Compensation) అందజేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. నష్టపోయన రైతుల వివరాలను యాప్ ద్వారా వివరాలు సేకరించి , గ్రామ సభల్లో మరోసారి చర్చించి నష్ట పరిహారం అందజేస్తామన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని పేర్కొన్నారు. రైతులకు బీమా, ఇన్పుట్ సబ్సిడీని అందిస్తామన్నారు.
జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రైతు బీమాను కట్టలేదని , ఖరీఫ్‌కు ఒక్కసారి మాత్రమే బీమా కట్టారని ఆరోపించారు.2024 వరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తున్నామని, ఈ పథకం కింద రూ. 2,500 కోట్లను కట్టామని, రైతులకు బీమా వస్తుందని పేర్కొన్నారు. వరదల విషయంలో చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించారుని తెలిపారు. టీడీపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోదని స్పష్టం చేశారు.