
అమరావతి : తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సీఎం జగన్ రెండేండ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో అవలంభిస్తున్న విధానాలతో ఏపీకి చెందిన అఖిల భారత సర్వీస్ అధికారులు సైతం నిర్ఘాంతపోతున్నారని ఆరోపించారు. శనివారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, జగన్ వచ్చాక 3 లక్షల 50 వేల కోట్లు అప్పులు చేశారని, ఆర్థిక నియంత్రణ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఏకపక్షంగా అసెంబ్లీ జరగడంతో ఎవరికి లాభం ఉందని ప్రశించారు. విపక్షం లేకుండా అసెంబ్లీలో చర్చిస్తారా.. ఇదేం పాలనా అంటూ ఉండవల్లి ప్రశ్నించారు.జగన్ పాలనలో అవినీతి లేదని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరారు. ప్రతిపక్షనేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ సభ్యులు తప్పుడు వ్యాఖ్యలు చేశారని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో విఫలమయ్యిందని విమర్శించారు.